: బిగ్ ఫైట్ రేపటికి పోస్ట్ పోన్... కోరం లేక వాయిదా పడ్డ కడప డీసీసీబీ భేటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప డీసీసీబీ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. పది నెలలుగా ఉత్కంఠ రేపుతున్న ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు అధికార టీడీపీ దాదాపుగా రంగం సిద్ధం చేసుకుంది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో తమకు లభించిన కడప డీసీసీబీ పీఠాన్ని ఎలాగైనా నిలబెట్టుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో నేటి ఉదయం ప్రారంభమైన డీసీసీబీ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. అయితే రేపు కూడా ఇదే పరిస్థితి తలెత్తితే, కోరం లేకపోయినా రేపు ఎన్నికను నిర్వహిస్తామని ఎన్నికల అధికారి పోనే నాయక్ ప్రకటించారు. దీంతో రేపటి సమావేశంపై మరింత ఉత్కంఠ నెలకొంది.