: కడపలో టీడీపీ, వైసీపీల మధ్య ‘బిగ్ ఫైట్’... నేడు, రేపు 144 సెక్షన్ విధింపు


ఫ్యాక్షన్ గడ్డ కడపలో మరో హోరాహోరీ పోరుకు తెరలేచింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు ఎవరికి వారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో నేడు తేలిపోనుంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పదవి కోసం ఇరు పార్టీలు ఢీకొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన సహకార ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ వైసీపీకే వచ్చినా, ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో రాష్ట్రంలో టీడీపీ అధికారం చేజిక్కించుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. డీసీసీబీ పీఠంపై రసవత్తర పోరు నెలకొంది. డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికైన వైసీపీ నేత తిరుపేలరెడ్డిని టీడీపీ వ్యూహాత్మకంగా ఆ పదవి నుంచి తప్పించగలిగింది. అంతేకాక వైసీపీకి చెందిన పలువురు పీఏసీఎస్ చైర్మన్లను తమవైపు తిప్పుకోవడంలోనూ సఫలమైనట్లు సమాచారం. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తిరుపేలరెడ్డిని గద్దె దించడంతో పాటు, తమ సభ్యులను అక్రమ పద్ధతుల్లో టీడీపీ కొనుగోలు చేస్తోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో కోర్టుకెక్కిన వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 2 తర్వాత ఎప్పుడైనా డీసీసీబీ చైర్మన్ ను ఎన్నుకోవచ్చంటూ హైకోర్టు స్పష్టం చేయడంతో నేడు ఈ ఎన్నికకు అధికార పార్టీ తెరలేపింది. ఇదిలా ఉంటే, కడప జిల్లా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినందున ఈ ఎన్నిక ఆ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. మరోవైపు జగన్ ను మట్టికరిపించేందుకు రంగంలోకి దిగిన టీడీపీ కూడా ఈ ఎన్నికను ముఖ్యమైనదిగానే పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల కీలక నేతలు కడపపై దృష్టి సారించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులను నివారించేందుకు పోలీసులు నేటితో పాటు రేపు కూడా కడప నగరంలో 144 సెక్షన్ విధించారు.

  • Loading...

More Telugu News