: టీడీపీ లేకపోతే కేసీఆర్ గొర్రెలు మేపుకునేవారు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి సిద్ధిపేటలో గొర్రెలు మేపుకునేవారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమస్యలు సానుకూలంగా పరిష్కరించుకుందామంటే కేసీఆర్ ముందుకు రావడంలేదని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడలో చంద్రబాబు ఈ మేరకు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకుంటామని, అయితే అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. నెలలోగా ఆస్తుల పంపకం పూర్తవ్వాలన్న చంద్రబాబు, రాష్ట్రాన్ని విభజించినవారు అసూయపడేలా కసిగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. భౌగోళికంగా విడిపోయినా తెలుగు జాతి కలిసే ఉండాలని, తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాదులో తనకు పనేంటని కేసీఆర్ అన్నారని, అలా అనేందుకు ఆయనకు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. అసలు టీడీపీ లేకుంటే కేసీఆర్ ఎక్కడుండేవారన్నారు.