: అమెరికాతో అణు ఒప్పందం కోసం ముడుపులిచ్చిన యూపీఏ నేత... సంచలనం సృష్టిస్తున్న పుస్తకం
త్వరలో విడుదల కానున్న ఓ పుస్తకంలోని విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికాతో ఎలాగైనా అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్న ఉద్దేశంతో 2008లో బిల్ క్లింటన్ దంపతులు నిర్వహిస్తున్న క్లింటన్ ఫౌండేషన్ కు యూపీఏ నేత, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అమర్ సింగ్ 5 మిలియన్ డాలర్ల వరకూ (సుమారు రూ. 32 కోట్లు-తాజా మారక లెక్కల ప్రకారం) చెల్లించాడని ఆ పుస్తకంలో ప్రస్తావించడమే ఇందుకు కారణం. ఆయన డబ్బులిచ్చిన తరువాతనే యూఎస్ కాంగ్రెస్ లో ఇండియా-యూఎస్ పౌర అణు ఒప్పందంపై చర్చ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో సెనేట్ కో-చైర్మన్ గా ఉన్న హిల్లరీ క్లింటన్ భారత్ కు అణు సహకారంపై తన వంతుగా సహకరిస్తూ, బిల్లుకు మద్దతిచ్చారని, అందువల్లే బిల్లు ఆమోదం పొందిందని 'క్లింటన్ క్యాష్' పేరిట విడుదల కానున్న పుస్తకం వివరించింది. అమర్ సింగ్ 1 నుంచి 5 మిలియన్ డాలర్లు ఇచ్చి వుండవచ్చని, అదే నిజమైతే, ఆయన మొత్తం ఆస్తుల్లో 20 నుంచి 100 శాతం వరకూ క్లింటన్ ఫౌండేషన్ కు వచ్చి ఉంటాయని పుస్తక రచయిత పీటర్ స్కివైజర్ అనుమానిస్తున్నారు. కాగా, ఈ పుస్తకంలో రాశారని భావిస్తున్న విషయాలు అసత్యాలని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. అనుమానాలపై తాను వ్యాఖ్యానించనని, కేవలం రూమర్లతో తనను బాధితుడిని చేయవద్దని అన్నారు. తాను చట్టానికి కట్టుబడిన వ్యక్తినని, ఇండియా చట్టాలను అతిక్రమించలేదని అన్నారు. కోల్ కతా, అలహాబాద్, కాన్పూర్ సెషన్స్ కోర్టులు తనను చట్టపరంగా విచారించాయని, ఎవరూ కూడా తనపై ఆరోపణలు నిరూపించలేకపోయారని తెలిపారు. మరోవైపు క్లింటన్ ఫౌండేషన్ కూడా ఈ వార్తలను ఖండించింది. తమ ఫౌండేషన్ ప్రజల కోసమే నిధులు సమీకరించిందని, పూర్తి పారదర్శకంగా లావాదేవీలను నిర్వహిస్తోందని క్లింటన్ ఫౌండేషన్ ప్రతినిధి మౌరా పాలీ తెలియజేశారు. ఈ విషయంలో స్పందించడానికి వైట్ హౌస్ వర్గాలు, అమెరికా ప్రభుత్వం నిరాకరించాయి.