: పోయినోళ్లు మంచోళ్లు... ఉన్నోళ్లు నరకం అనుభవిస్తున్నారు!


నేపాల్ ను వణికించిన భూకంపంలో తామెందుకు చనిపోలేదా? అని ప్రజలు బాధపడే పరిస్థితి ఏర్పడింది. ఆరు రోజుల క్రితం తొలి ప్రకంపనలు వచ్చిన తరువాత సుమారు 100 సార్లకు పైగా భూమి కంపించింది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన అత్యధికులు ఇంకా ఇళ్లలోకి పోకుండా రహదార్లపైనే కాలం వెళ్లదీస్తున్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు భారీ వర్షాలు కురుస్తుండడం, అంటురోగాలు భయపెడుతుండడంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. వర్షం కారణంగా సహాయక చర్యలు మందకొడిగా సాగుతుండడంతో భూకంపంలో తామెందుకు చనిపోలేదా అని వాపోతున్నారు. మరోవైపు గాయపడిన వారి ఆర్తనాదాలు ఇంకా చల్లారలేదు. ఆసుపత్రుల్లో చేరిన వారికి సరిపడా పడకలు లేక, నేలపైనా స్థలం లేక ఆరుబయట వర్షంలోనే చికిత్సలు జరుగుతుండగా, వర్షాల దెబ్బకు గాయాలు మానడంలేదని వాపోతున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో పలువురికి ఇన్ఫెక్షన్ సోకడంతో అవయవాలు తీసేయాల్సి వస్తోందని భారత ఆర్మీ మెడికల్ డాక్టర్లు తెలిపారు. మొత్తం పది మందికి అవయవాలు తీసేయాల్సి వచ్చిందని ఖాట్మాండు కంటోన్మెంట్ ప్రాంతంలో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసిన ఇజ్రాయిల్ డాక్టర్ల బృందం తెలిపింది. వర్షాలు పూర్తిగా తగ్గితే సహాయక చర్యలు పూర్తి చేయడానికి కనీసం వారం నుంచి పది రోజుల వరకూ పట్టవచ్చని అంచనా.

  • Loading...

More Telugu News