: వరల్డ్ నెంబర్ వన్ పార్టీగా బీజేపీ.. 10 కోట్ల 50 లక్షల సభ్యత్వాలతో రికార్డు
భారతీయ జనతా పార్టీ వరల్డ్ రికార్డు సృష్టించింది. అత్యధిక సభ్యత్వాలతో నెంబర్ వన్ పార్టీగా అవతరించింది. బీజేపీలో 10 కోట్ల 50 లక్షల మంది సభ్యులుగా చేరారని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. లక్ష్యంగా పెట్టుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. చైనా మార్క్సిస్టు పార్టీ 8.3 కోట్ల సభ్యత్వాలతో ద్వితీయస్థానానికి పరిమితమైంది. తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వాలు గణనీయస్థాయిలో నమోదయ్యాయని తెలిపారు. సభ్యత్వ నమోదు డ్రైవ్ కు ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 6 లక్షల 46 వేల సభ్యత్వాలు ఉంటే, ఇప్పుడు 35 లక్షల 46 వేలకు చేరిందని చెప్పారు. సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను వివరించే పుస్తకాలను సభ్యులకు అందిస్తామన్నారు. కొన్ని రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సభ్యత్వ నమోదు చేపట్టామని అమిత్ షా పేర్కొన్నారు. సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తూ, అంతర్గత ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే పార్టీ తమదేనని ఉద్ఘాటించారు. సభ్యత్వ నమోదుకు తాము హైటెక్ విధానాలు వినియోగించామని తెలిపారు. ఓ మొబైల్ నెంబర్ డయల్ చేయడం ద్వారా బీజేపీ సభ్యత్వం పొందే అవకాశం కల్పించామని చెప్పారు. తమ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పేందుకు సంతోషిస్తున్నానని తెలిపారు.