: నేపాల్ బాధితులకు 'బీఫ్' పంపించి వివాదంలో చిక్కుకున్న పాకిస్థాన్
ఎప్పుడూ వివాదాల్లో ఉండే పాకిస్థాన్... నేపాల్ భూకంప బాధితులకు సాయం చేసే అంశంలో కూడా వివాదంలో ఇరుక్కుంది. భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ కు పలు దేశాలు తమవంతు సాయం చేస్తున్నాయి. ఇదే రీతిలో పాకిస్థాన్ కూడా భూకంప బాధితులకు ఆహారాన్ని పంపించింది. అయితే, పాక్ పంపింది మామూలు ఆహారం కాదు... బాగా మాసాలా దట్టించిన బీఫ్. ప్రపంచంలోనే అత్యధిక శాతం హిందువులను కలిగిన నేపాల్ లో... మతాచారం ప్రకారం బీఫ్ ను భుజించరు. దీంతో, నేపాల్ కు బీఫ్ మాంసాన్ని పంపి పాక్ సరికొత్త వివాదానికి తెరలేపినట్టైంది. ఈ అంశంపై ఇండియా నుంచి నేపాల్ వెళ్లి, అక్కడి బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ, పాక్ పంపిన ఆహారాన్ని తాము ముట్టుకోలేదని తెలిపారు. ఈ విషయం తెలియని స్థానికులు మొదట ఆ ఆహారాన్ని తిన్నప్పటికీ... విషయం తెలిసిన తర్వాత పక్కన పడేశారని చెప్పారు. రానున్న రోజుల్లో సార్క్ దేశాల సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.