: ఆదాయపు పన్ను శాఖను కోర్టుకు లాగిన విదేశీ ఇన్వెస్టర్లు
వివాదాస్పద 'కనీస ప్రత్యామ్నాయ పన్ను' (ఎంఏటీ - మినిమమ్ ఆల్టర్నేటివ్ టాక్స్) సరికాదని వాదిస్తూ, భారత ఆదాయపు పన్ను శాఖకు వ్యతిరేకంగా పీఎఫ్ఐ (ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్)లు ముంబై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ పీఎల్సీ, బీఎన్ పీ పారిబాస్ ఎల్-1 సంస్థలతో భారత ఐటీ శాఖకు ఎంఏటీ వివాదాలు నడుస్తున్నాయి. నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ మూడు పిటిషన్లు దాఖలు చేయగా, న్యాయ సేవల సంస్థ ఖేతాన్ ద్వారా మరో మూడు ఫండ్ సంస్థలు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశాయి. కాగా, ఈ సంస్థలన్నీ అమెరికా, బ్రిటన్, లక్సెంబర్గ్ చట్ట పరిధులకు లోబడి ఈ రిట్ లను దాఖలు చేయగా, ఆయా దేశాలతో భారత్ కు ఉన్న ఒప్పందాల మేరకు మూలధన లాభాలపై కంపెనీలకు మినహాయింపులు వర్తించవు. హైకోర్టు ఈ పిటిషన్లపై విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. ఇప్పటివరకూ ఆదాయపు పన్ను విభాగం మొత్తం రూ. 602 కోట్లను డిమాండ్ చేస్తూ, 68 నోటీసులను వివిధ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు జారీ చేసిన సంగతి తెలిసిందే.