: పీఛే మూడ్... నాంపల్లి కోర్టునే ఆశ్రయించండి: సత్యం దోషులకు హైకోర్టు సూచన
సత్యం కంప్యూటర్స్ స్కాం దోషులు రామలింగరాజు సహా మరో తొమ్మిది మందికి హైకోర్టులో చుక్కెదురైంది. సత్యం కంప్యూటర్స్ లాభాలను ఎక్కవ చేసి చూపి మదుపరులను నిండా ముంచిన రామలింగరాజు, రామరాజు, మరో ఎనిమిది మందికి సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ కోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ తమకు బెయిల్ మంజూరు చేయాలని దోషులు నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పును పున:సమీక్షించే అధికారం తమకు లేదని చెప్పిన నాంపల్లి కోర్టు హైకోర్టును ఆశ్రయించమని సత్యం దోషులకు సూచించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. కొద్దిసేపటి క్రితం ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు, ఈ కేసును తాము విచారించజాలమని తేల్చిచెప్పింది. బెయిల్ కోసం నాంపల్లి కోర్టునే ఆశ్రయించాలని సూచిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఎటువైపు వెళ్లాలో తెలియక సత్యం దోషులు అయోమయంలో పడ్డారు.