: బీజేపీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది... ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్య
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నేటి ఉదయం భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు శరద్ పవార్ అర్రులు చాచారు. బీజేపీ ప్రకటనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా బేషరతుగా మద్దతు పలికేందుకు ఆయన ముందుకొచ్చారు. అయితే, నాడు బీజేపీ, ఎన్సీపీతో కాకుండా తన పాత మిత్రపక్షం శివసేనతో కలిసి ముందుకు సాగేందుకే మొగ్గుచూపింది. తాజాగా నేటి ఉదయం ఎన్సీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా శరద్ పవార్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. పది నెలల క్రితం ‘అచ్చే దిన్’ పేరిట జనాలను ఊదరగొట్టిన బీజేపీ వంద శాతం ఫలితాలతో అధికారం చేపట్టిందని, అయితే ఏడాది కూడా గడవకముందే ఆ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.