: తెలంగాణలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు
బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. నిరంతరం ఎక్కడో ఒక చోట రైతుల మృత్యు ఘోష వినిపిస్తూనే ఉంది. తాజాగా, ఈ తెల్లవారుజామున గుంటుక వేణుగోపాల్ రెడ్డి (45) అనే రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా ఆలేరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, తనకున్న ఐదు ఎకరాల పొలాన్ని సాగు చేయడం కోసం వేణుగోపాల్ రెడ్డి అప్పులు చేశాడు. అప్పులు, వడ్డీలు పెరిగిపోవడంతో... వాటిని ఎలా తీర్చాలో అర్థంకాని దీన స్థితిలో వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.