: ఈ 'బొద్దబ్బాయ్' ప్రతిభకు ముగ్ధుడై దండం పెట్టిన కోహ్లీ
తనకన్నా చాలా చిన్నవాడైన ఓ క్రికెటర్ ఆట తీరు కోహ్లీకి తెగ నచ్చేసింది. అతని ప్రతిభకు ముగ్ధుడై మైదానంలోనే 'నీ బాదుడుకో దండం రా బాబూ' అన్నట్టు వంగి మరీ అభినందనలు చెప్పాడు. ఆ దృశ్యాలు క్రికెట్ ప్రపంచాన్ని, అభిమానులనూ అలరిస్తున్నాయి. భారత జట్టుకు కాబోయే మియాందాద్ అని, కాదు కాదు రణతుంగ అని, మరికొందరు డిసిల్వాలా అడుతున్నాడు అని కామెంటేటర్లు సైతం అతని ఆటకు 'ఫిదా' అయిపోతున్నారు. ఇంతకీ ఎవరా క్రికెటర్ అనుకుంటున్నారా? వారం రోజుల క్రితం 17 ఏళ్లా 177 రోజుల వయసులో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులు బ్రేక్ చేసిన 'బొద్దబ్బాయ్' సర్ఫరాజ్ ఖాన్. 2009లో ముంబై స్కూల్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ లో 439 పరుగులు చేసి వెలుగులోకి వచ్చిన సర్ఫరాజ్, అండర్-19 పోటీల్లో భాగంగా, 15 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లోనే 101 పరుగులు కొట్టి సత్తా చాటాడు. నిన్నటి మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకు పడి 21 బంతుల్లో 45 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పుడు సర్ఫరాజ్ ప్రతిభను పొగుడుతూ, మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతల నుంచి క్రికెట్ అభిమానుల వరకు, సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురిపిస్తున్నారు.