: ఇక ఓపిక నశించింది... రోడ్డెక్కిన నేపాల్ ప్రజలు... నిరసనల వెల్లువ


స్వతహాగా శాంత స్వభావులైన నేపాల్ ప్రజల ఓపిక నశించింది. భూకంపం ధాటికి సర్వం కోల్పోయి వీధినపడ్డ ప్రజలు తమను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, మరింత సహాయాన్ని కోరుతూ వీధుల్లో నిరసనలకు దిగారు. ఈ ఉదయం ఖాట్మాండులోని పార్లమెంట్ భవనం ముందు వందల మంది ప్రజలు ధర్నాకు దిగారు. కనీసం తమ గ్రామాలకు వెళ్లేందుకు బస్సులనైనా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువులతో వెళ్తున్న లారీలను వారు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బియ్యం, నూడుల్స్, బిస్కెట్స్ తదితరాలతో గ్రామీణ ప్రాంతాలకు వెళుతున్న రెండు లారీలను, సహాయక సామగ్రితో వస్తున్న మూడు ఆర్మీ ట్రక్కులను ప్రజలు అడ్డగించారు. కేవలం జిల్లా కేంద్రాలకు ఆహారాన్ని పంపుతూ, రాజధాని ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ప్రజలు షాపులను లూటీ చేసినట్టు వార్తలు వచ్చాయి. కాగా, సహాయక చర్యలు చేపట్టడంలో తాము కొంత విఫలమైనట్టు నేపాల్ సమాచార శాఖ మంత్రి మినేంద్ర రాజ్ పాల్ అంగీకరించారు. భూకంపం తరువాత నాలుగు రోజులుగా రోడ్లపైనే విశ్రమించిన నేపాల్ ప్రజల్లో చాలామంది గత రాత్రి మాత్రం ఇళ్లకు వెళ్లి నిద్రపోయారు.

  • Loading...

More Telugu News