: తల్లీకూతుళ్లను వేధించి బస్సు నుంచి తోసేసిన దుర్మార్గులు... కూతురు మృతి
తన కుమార్తెను వేధిస్తున్న వారిని అడ్డుకున్నందుకు, కదులుతున్న బస్సులో నుంచి తల్లీకూతుళ్లను తోసివేశారు. తీవ్రగాయాల పాలై ఆదుకునేవారులేక రక్తమోడుతూ, గంట పాటు ప్రాణాలతో పోరాడి కుమార్తె మరణించగా, తల్లి ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. ఈ ఘటన పంజాబ్ లో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మోగా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ, తన పద్నాలుగేళ్ల కూతురు, కుమారుడుతో కలిసి గురుద్వారా దర్శనానికి ప్రైవేట్ బస్సులో బయలు దేరారు. కొంత దూరం వెళ్లాక, బస్సులోని కొందరు వ్యక్తులు ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వారిని వారించేందుకు తల్లి ప్రయత్నించగా దాడి చేశారు. ఆమె కండక్టర్ కు ఫిర్యాదు చేయగా అతడు కూడా, ఆ దుర్మార్గులకే మద్దతిచ్చాడు. డ్రైవర్ తో మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. బస్సు ఆపమని బతిమిలాడినా ఆపలేదు. కాసేపటి తరువాత వారిని నిర్దయగా బస్సులో నుంచి తోసేశారు. రోడ్డు మీద పడి బలమైన గాయాల పాలయిన బాలికకు చాలాసేపటి వరకూ ఎలాంటి సాయమూ అందలేదు. ఆ బాలిక మరణించగా, తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బస్సును గుర్తించిన పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని వేధించిన వారు డ్రైవర్ స్నేహితులని భావిస్తున్నట్టు తెలిపారు. నిందితులను వదిలిపెట్టబోమని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.