: మీ క్లయింటు చాలామందికి నయం చేస్తున్నాడు, తల్లికి కూడా నయం చేసుకుంటాడు: ఆశారాం తనయుడి కేసులో 'సుప్రీం' వ్యాఖ్య
ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపు తనయుడు నారాయణ సాయికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై గుజరాత్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాయికి మంజూరైన బెయిల్, అతని తల్లి శస్త్రచికిత్సకు వైద్యులు తేదీ ప్రకటించినప్పుడే వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. "అయినా, మీ క్లయింటు చాలామందికి నయం చేస్తున్నాడు, తల్లికి కూడా నయం చేసుకుంటాడు" అని కోర్టు సాయి తరపు న్యాయవాదికి సూచించింది. ఇక, గుజరాత్ సర్కారు తన వాదనల్లో భాగంగా, మూర్ఖ మహిళలు నారాయణ సాయిని శ్రీకృష్ణుడిలా ఆరాధిస్తున్నారని, అతడితో కలిసి గోపికల్లా డ్యాన్సు చేస్తున్నారని న్యాయస్థానానికి విన్నవించింది. అతడు బెయిల్ పై బయటికొస్తే, మూర్ఖ మహిళల ఆరాధన కారణంగా, తిరిగి అతడిని జైలుకు పంపడం సమస్యాత్మకం అవుతుందని వివరించింది. 2013లో అతడి అరెస్టు సందర్భంలో ఇలాంటి సమస్యే ఎదురైందని తెలిపింది.