: కేసీఆర్ ను అంతమాట అంటాడా?... జేపీని అరెస్టు చేయాల్సిందే: టి.లాయర్ల జేఏసీ డిమాండ్
లోక్ సత్త పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణను అరెస్టు చేయాలని తెలంగాణ లాయర్ల జేఏసీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన జేపీపై చర్యలు తీసుకోవాలంటూ జేఏసీ నేతలు గాంధీనగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియాన్ని తెలంగాణ కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక 'కళాభారతి'గా మార్చాలని కేసీఆర్ నిర్ణయించడంపై జేపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదవాళ్లకు ఆటస్థలంగా ఉపయోగపడుతున్న స్టేడియంలో 'కళాభారతి' నిర్మించడం అవసరమా? అని జేపీ ప్రశ్నించారు. ఎన్టీఆర్ స్టేడియాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ కు అందివచ్చిన అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని వ్యాఖ్యానించారు.