: నటనలో 'మాస్టర్' అనిపించుకోవాలని యువ మాల్యా తాపత్రయం
వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యా తనయుడు సిద్ధార్థ్ మాల్యా యాక్టింగ్ కెరీర్ దిశగా అడుగులేస్తున్నాడు. నటనలో మాస్టర్స్ డిగ్రీ కోసం లండన్ వెళుతున్నాడు. ఇప్పటికే రెండు లఘు చిత్రాల్లో నటించిన సిద్ లండన్ లోని ప్రతిష్ఠాత్మక రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామాలో తన ప్రతిభకు మెరుగులు దిద్దుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై యువ మాల్యా స్పందిస్తూ... "యాక్టింగ్ ను కెరీర్ గా ఎంచుకున్నాను. చిత్ర పరిశ్రమలో ఉన్న పోటీ దృష్ట్యా వేగంగా నటనకు మెరుగులు దిద్దుకోవడం చాలా ముఖ్యం" అని ట్వీట్ చేశాడు. రాయల్ సెంట్రల్ స్కూల్లో సీటు దక్కడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నాడు. అక్టోబరు నుంచి తరగతులు మొదలవనుండగా, సిద్ధార్థ్ మాల్యా ఉద్విగ్నతకు గురవుతున్నాడట. అప్పటిదాకా ఆగలేకపోతున్నానని ట్విట్టర్ లో తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా సిద్ధార్థ్ మాల్యా, బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మధ్య ప్రేమాయణం నడిచిందని మీడియా కోడై కూసింది. అప్పట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడిన మ్యాచ్ లలో గ్యాలరీల్లో వీరిద్దరూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.