: తల తీయించేందుకు ఆయన రాలేడుగా... రెచ్చిపోతున్న వ్యాపారులు
అది 1934వ సంవత్సరం. నేపాల్ ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. సహాయక చర్యలు కొనసాగుతున్న వేళ కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను అమాంతం పెంచేశారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి ప్రధాని జంగ్ బహదూర్ రాణా ఆగ్రహంతో ఊగిపోయారు. ఎవరైనా అక్రమ నిల్వలు ఉంచి దొరికిపోతే తల నరికివేయిస్తానని హెచ్చరించాడు. దీంతో వ్యాపారులు దారికి వచ్చారు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. తల తీయించేందుకు ఆయన రాలేడనేమో... వ్యాపారులు రెచ్చిపోయారు. రూ. 212 ధర ఉన్న నెస్టిల్ పాలపొడిని రూ. 400 చేసేశారు. కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. బిస్కెట్లు, నూడుల్స్, మంచినీటి బాటిల్ తదితరాల కృత్రిమ కొరత కనిపిస్తోంది. కొన్ని చోట్ల మాత్రమే లభించే మాంసం ధర ఆకాశానికి ఎగసింది. ఇక టాక్సీలు, రిక్షాల సంగతి చెప్పక్కర్లేదు. బాధితుల నుంచి అందిన కాడికి దోచుకోవడమే వారి పని. ముఖ్యంగా యాత్రల కోసం వెళ్లి అక్కడ చిక్కుకున్న వారి బాధలు వర్ణనాతీతం. సరుకులు దాచినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని నేపాల్ హోం శాఖ ప్రకటించినా, ప్రభావం కనిపించలేదు. ఆనాటి కాలం కాదు, అప్పటి రాజూ లేడు కదా?