: ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రిగా ఎలా కొనసాగుతారు?: రేవంత్ రెడ్డి
ఏదైనా మాట్లాడే ముందు విషయాన్ని పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని టీఆర్ఎస్ నేతలకు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సూచించారు. ఏపీలో వైకాపా తరపున గెలిచిన వారెవరూ టీడీపీలో చేరలేదని... వైకాపా గుర్తుపై గెలిచిన వారు టీడీపీలో చేరినట్టు స్పీకర్ కు కూడా ఫిర్యాదులు అందలేదని చెప్పారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తించాలని హితవు పలికారు. ఈ రోజు స్పీకర్ మధుసూదనాచారిని టీడీపీ నేతలు కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో మంత్రి కడియం శ్రీహరిపై రేవంత్ విరుచుకుపడ్డారు. ఓ వైపు ఎంపీగా కొనసాగుతున్న ఆయన రాష్ట్ర మంత్రిగా ఎలా కొనసాగుతారని నిలదీశారు. కడియంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు, పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థ చట్టవిరుద్ధమని, దీనిపై హైకోర్టులో కేసు వేశామని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే చర్య తీసుకోవాలని అన్నారు.