: మూడేళ్లకే విసుగొచ్చింది...‘కేర్’వాటాల విక్రయం కోసం అమెరికా కంపెనీ యత్నాలు
గుండె సంబంధిత వ్యాధుల్లో దేశంలోనే అగ్రగామి వైద్యాలయంగా పేరుగాంచిన కేర్ హాస్పిటల్స్ వాటాల విక్రయం మరోమారు తెరపైకి వచ్చింది. ప్రముఖ హృద్రోగ నిపుణుడు సోమరాజు నేతృత్వంలో కొంతమంది వైద్యులు ప్రారంభించిన ఈ ఆస్పత్రి, అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ప్రస్తుతం కేర్ హాస్పిటల్స్ 17 శాఖలకు విస్తరించింది. కేర్ హాస్పిటల్స్ పనితీరు చూసి 2012లో ఆగమేఘాలపై 105 మిలియన్ డాలర్లు (రూ.650 కోట్లు) వెచ్చించి అమెరికాకు చెందిన అడ్వెంట్ ఇంటర్నేషనల్ 72 శాతం వాటా కొనుగోలు చేసింది. మూడేళ్లు కూడా తిరగలేదు. అప్పుడే కేర్ హాస్పిటల్స్ వాటాలను అమ్మేందుకు అడ్వెంట్ యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆ సంస్థ పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో ముమ్మర చర్యలు జరుపుతోంది. 105 మిలియన్లతో కొనుగోలు చేసిన కేర్ వాటాలను అడ్వెంట్ 250-300 మిలియన్ డాలర్లకు అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. మణిపాల్ హాస్పిటల్స్, ఫోర్టిస్ హెల్త్ కేర్ లతో పాటు కార్లైల్ గ్రూప్ తోనూ అడ్వెంట్ చర్చిస్తోంది.