: పరిటాల సునీత నియోజకవర్గంలో వైకాపా నేత దారుణ హత్య... నరికి చంపిన ప్రత్యర్థులు
ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైకాపా నేత ప్రసాద్ రెడ్డి (50)ని ప్రత్యర్థులు ఈ మధ్యాహ్నం పాశవికంగా హత్య చేశారు. ఓ పని నిమిత్తం కార్యాలయానికి వచ్చిన అతడిని... ప్రత్యర్థులు పథకం ప్రకారం వెంటాడి వేట కొడవళ్లతో అత్యంత దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలోనే జరగడం గమనార్హం. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హత్య స్థానికంగా సంచలనం రేపుతోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రసాద్ రెడ్డి మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. హత్యకు గురైన ప్రసాద్ రెడ్డి వైకాపా మండల కన్వీనర్ గా కూడా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి ఆయన సన్నిహితుడు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.