: ఆల్ ఖైదాతో లఖ్వీ సంబంధాలు బలపడుతున్నాయి... కేంద్రానికి ‘రా’ నివేదిక!


జైలు నుంచి విడుదలైన లష్కరే తోయిబా చీఫ్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ మరింత ప్రమాదకరంగా మారనున్నాడట. ఒక్క భారత్ కే కాక మధ్యప్రాచ్యానికి కూడా అతడి నుంచి ముప్పు పొంచి ఉందట. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి ‘రీసెర్జీ అండ్ అనాలసిస్ వింగ్ (రా)’ ఓ నివేదికను అందజేసింది. లష్కరే తోయిబా చీఫ్ గా ఉన్న లఖ్వీ ముంబై బాంబు పేలుళ్లకు సూత్రధారిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత్ ఫిర్యాదుతో పాకిస్థాన్ అతడిని అరెస్ట్ చేసి అడియాల జైలులో పెట్టింది. అయితే అతడిపై మోపిన అభియోగాలను నిరూపించడంలో దర్యాప్తు అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్న క్రమంలో లాహోర్ కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో బయటకు వచ్చిన లఖ్వీ, ప్రస్తుతం పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉగ్రవాద ప్రసంగాలు చేస్తున్నాడు. లఖ్వీ అరెస్ట్ కాకముందు లష్కరే తోయిబాకు సిరియాలోని ఆల్ ఖైదాతో మెరుగైన సంబంధాలుండేవి. అతడి అరెస్ట్ తో ఆ సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. తాజాగా అతడు తిరిగి బయటకు రావడంతో లష్కరే, ఆల్ ఖైదాల మధ్య మళ్లీ సంబంధాలు బలపడే ప్రమాదం లేకపోలేదని తన నివేదికలో ‘రా’ కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. ఇదే జరిగితే ఒక్క భారత్ కే కాక మధ్యప్రాచ్యంలోని పలు దేశాలకు కూడా ఉగ్రముప్పు తప్పదని ‘రా’ ఆందోళన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News