: తెలంగాణలో రాహుల్ పర్యటన తేదీలు ఖరారు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రాష్ట్రంలో పర్యటించే తేదీలు ఖరారయ్యాయి. మే 9,10 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ లేదా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సెగ్మెంట్ నుంచి రాహుల్ పాదయాత్ర చేసే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ పరామర్శించనున్నారు. అంతేగాక రైతు ఆత్మహత్యలు, వడగళ్లతో ఎక్కువ నష్టం జరిగిన ప్రాంతాల్లో రాహుల్ 20 కిలో మీటర్ల పాదయాత్ర చేస్తారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించి రైతు కుటుంబాలను పరామర్శించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇప్పటికే నిర్ణయించిన సంగతి విదితమే.