: పాతబస్తీలో రెచ్చిపోతున్న పోలీస్ ఇన్ఫార్మర్లు...పోలీస్ స్టేషన్లే అడ్డాగా వసూళ్లు!
హైదరాబాదు పాతబస్తీ... ఉగ్రవాద మూకలు, రౌడీ షీటర్లకే కాదు, పోలీస్ ఇన్ఫార్మర్లకూ అడ్డాగా మారింది. పోలీస్ స్టేషన్లను అడ్డాలుగా చేసుకుంటున్న పోలీస్ ఇన్ఫార్మర్లు బహిరంగంగానే సెటిల్ మెంట్లు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మాట వినని వారిపై పోలీసుల ముందే దాడులకు పాల్పడుతున్న వీరి ఆగడాలకు అడ్డే లేకుండాపోతోంది. నిత్యం వీరి నుంచి ఎదురవుతున్న వేధింపుల కారణంగా అక్కడ వ్యాపారం చేసుకుంటున్న చిన్నా చితక వ్యాపారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల పోలీస్ ఇన్ఫార్మర్ల ఆగడాలు మరింతగా పెరిగాయి. దీంతో వీరి బారి నుంచి రక్షణ కల్పించాలంటూ వ్యాపారుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రఖీబ్ అనే పోలీస్ ఇన్ఫార్మర్ దౌర్జన్య కాండ వెలుగుచూసింది. భవానీ నగర్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా రఖీబ్ జబర్దస్తీ చేస్తున్నాడు. భవానీనగర్ తో పాటు తలాబ్ కట్ట, మొఘల్ పురా ప్రాంతాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అతగాడు, రాజకీయ నేతలతోనూ సంబంధాలు నెరపుతూ యథేచ్ఛగా దాడులు చేస్తున్నాడని వ్యాపారులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాతబస్తీ పరిధిలోని పోలీస్ స్టేషన్లపై పోలీసు బాసులు దృష్టి సారించారు.