: ఎవరీ కరణ్ గిల్హోత్రా?... భారత క్రికెట్లో అలజడి రేపుతున్నాడు!


బీసీసీఐ కార్యదర్శిగా కొత్తగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్ కు కష్టకాలం నడుస్తోంది. ఓ క్రికెట్ బుకీతో ఠాకూర్ కు లింకులున్నాయంటూ మీడియాలో కథనాలు రావడంతో భారత క్రికెట్ వర్గాల్లో అలజడి మొదలైంది. అటు, ఠాకూర్ విషయమై ఐసీసీ... బీసీసీఐకి లేఖ రాయగా, ఘాటైన పదజాలంతో ఠాకూర్.... ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ను ఉద్దేశించి లేఖ రాయడం సంచలనం కలిగించింది. మీడియాలో వచ్చిన ఫొటోను శ్రీనివాసనే లీక్ చేశాడంటూ ఠాకూర్ ఆరోపించారు. బోర్డు సభ్యులపైనా శ్రీనీ స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించాడని తన లేఖలో ఆరోపించారు. త్వరలోనే అవన్నీ బయటికి వస్తాయని తెలిపారు. అసలు, ఇంతటి భారీ కుదుపులకు కారణమైన వ్యక్తి పేరు కరణ్ గిల్హోత్రా. ఇతను కలిసింది ఠాకూర్ ఒక్కడినే అయితే, ఇంత చర్చ ఉండేది కాదు. గిల్హోత్రా... యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ లతో పాటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కూడా కలిశాడు. వారితో ఫొటోలు దిగి తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేయడంతో అతడి కార్యకలాపాలపై సందేహాలు మొదలయ్యాయి. పంజాబ్ లోని ఫజిల్కా ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామం ఘనియాని గిల్హోత్రా స్వస్థలం. ఇతగాడి పేరిట ఓ రికార్డు కూడా ఉంది. పిన్న వయసులో సర్పంచ్ గా ఎన్నికయ్యాడంటూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటిచ్చారు. శిరోమణి అకాలీదళ్ పార్టీతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. హోండా డీలర్ కూడా. సల్మాన్ ఖాన్ 'బీయింగ్ హ్యూమన్' ఫౌండేషన్ ఫ్రాంచైజీ కూడా నిర్వహిస్తున్నాడు. తనను బుకీగా పేర్కొంటూ మీడియాలో వార్తలు రావడంపై గిల్హోత్రా స్పందించాడు. అనురాగ్ ఠాకూర్ తనకు పదేళ్లుగా తెలుసని, తనకు మంచి స్నేహితుడని చెప్పాడు. క్రికెట్ వర్గాల్లోనూ, సెలబ్రిటీల్లోనూ తనకు ఎందరో మిత్రులున్నారని, వారితో సన్నిహితంగా మెలిగినంత మాత్రాన తప్పు చేస్తున్నట్టు కాదని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News