: అమెరికాలో ఆందోళనకారులు పోలీసుల్ని, అధికారుల్ని ఉతికేశారు!
ఓ నల్లజాతీయుడి లాకప్ డెత్ బాల్టిమోర్ నగరాన్ని అల్లకల్లోలం చేసింది. అమెరికాలోని మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లో ఆఫ్రికన్ అమెరికన్ అయిన ఫ్రెడ్డీ గ్రేను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతను పోలీస్ కస్టడీలో వెన్నెముక గాయంతో మృతి చెందాడు. ఫ్రెడ్డీ గ్రేకి సంతాపం ప్రకటించే క్రమంలో ఆందోళనలు చెలరేగాయి. బాల్టిమోర్ లో వేలాది మంది ఆందోళనకారులు రోడ్లమీదికి వచ్చి అల్లకల్లోలం సృష్టించారు. ఎదురుగా కనిపించిన భద్రతాధికారిని, పోలీసులని ఉతికిపారేశారు. వారిని అదుపుచేసేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 15 మంది అధికారులు గాయపడ్డారు. దీంతో నగరంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు మేయర్ ప్రకటించారు. వారం రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపారు. ఆందోళనకారులు షాపులు పగుల గొట్టి దోచుకుపోయేందుకు ప్రయత్నిస్తుండడంతో పోలీసులు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు 5 వేల మంది జాతీయ భద్రతాదళాల సిబ్బందిని రంగంలోకి దించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పెప్పర్ స్ప్రేను పోలీసులు ఉపయోగించడం విశేషం. కాగా, కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు.