: ఖాట్మండూ విమానాశ్రయంలో గందరగోళం


నేపాల్ లోని ఖాట్మండూ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. భూకంపం కారణంగా నేలమట్టమైన నేపాల్ నుంచి తిరిగి స్వస్థలాలకు చేరుకునేందుకు వివిధ దేశాలకు చెందిన వారు ఆరాటపడుతున్నారు. దీంతో, నేపాల్లో ఉన్న ఏకైక విమానాశ్రయం త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా విమానాశ్రయానికి పోటెత్తారు. సాధారణ విమానాలతో పాటు మిలటరీ విమానాలతోనూ ప్రయాణికులను నేపాల్ నుంచి తరలిస్తున్నా, రద్దీ తగ్గడంలేదు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలను ముందు పంపించాలని అక్కడి అధికార వర్గాలు నిర్ణయించాయి. అయితే, ఎవరికివారు తాము ముందెళ్లాలంటూ అధికారులతో వాదనకు దిగుతుండడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా, ప్రయాణికులు వినడంలేదు. దీంతో, తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయి. చివరి నిమిషంలో కొందరి పేర్లు ప్రయాణికుల జాబితాలో చేర్చుతున్నారంటూ ఇతరులు ఆరోపిస్తున్నారు. అందరినీ త్వరితగతిన స్వస్థలాలకు చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు వస్తుండడంతో నేపాల్ లో ఉండడం క్షేమకరం కాదని అత్యధికులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News