: ఇంజినీరింగ్ అద్భుతం పశుపతినాథ ఆలయం... పెను భూకంపానికి చెక్కుచెదరని వైనం
నేపాల్ ను పెను భూకంపం పెకలించివేసింది. రాజధాని ఖాట్మండూలోని ఆ దేశ అధ్యక్ష భవనం కూడా భూకంపం ధాటికి బీటలు వారింది. ప్రధాని నివాసానికి కూడా నెర్రలు తప్పలేదు. హిందూ దేవాలయాలకు ప్రసిద్ధిగాంచిన ఆ దేశంలోని ప్రాచీన ఆలయాలతో పాటు చారిత్రక సంపద కూడా దాదాపుగా నేలమట్టమైంది. అయితే క్రీస్తు శకం ఐదో శతాబ్దంలో రూపుదిద్దుకున్న పశుపతినాథ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. భారీ విధ్వంసాన్ని సృష్టించిన భూకంపం పశుపతి నాథుడి సన్నిధికి వందల గజాల దూరంలోనే నిలిచిపోయింది. భూకంపం సమయంలో పశుపతినాథుడి ఆయలంలో పెద్ద సంఖ్యలో భక్తులున్నారు. అయినా వారిలో ఏ ఒక్కరికి ఇసుమంతైనా ఆపద కలగలేదు. భూకంపం అనంతరం ఆలయ పటిష్ఠతను గమనించిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయం నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలపై నిపుణులు దృష్టి సారించారు. ఐదో శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం, పెను భూకంపాన్ని తట్టుకుని నిలబడటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పశుపతినాథుడి ఆలయం ఇంజినీరింగ్ అద్భుతమేనని అక్కడి నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు.