: 8,975 ఎన్జీవోల లైసెన్సులు రద్దు చేసిన కేంద్రం
దేశవ్యాప్తంగా దాదాపు 8,975 ఎన్జీవోల లైసెన్సులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సంస్థలన్నీ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్ సీఆర్ ఏ) ను ఉల్లంఘించినట్టు తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ కఠిన చర్యలు తీసుకుంది. అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి భారత్ లోని పలు ఎన్జీవోలకు నిధులు వస్తుంటాయి. ఈ నిధుల విడుదల విషయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల సదరు ఫౌండేషన్ ఖాతాల నుంచి ఏ ఒక్క భారత స్వచ్ఛంద సంస్థలకు నిధులు విడుదల చేయొద్దని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఆ తరువాత గ్రీన్ పీస్ ఇండియా ఇచ్చిన ఎఫ్ సీఆర్ ఏ లైసెన్సును కూడా రద్దు చేసింది. అంతేగాక పలు చట్టాల ఉల్లంఘన కింద వారి బ్యాంక్ ఖాతాలను కూడా స్తంభింపజేసింది. ఈ వరుసలో 2009-10, 2010-11, 2011-2012 సంవత్సరాల్లో వార్షిక రిటర్నులు దాఖలు చేయని దేశంలోని 10,343 ఎన్జీవోలకు గతేడాది అక్టోబర్ 16న హోంశాఖ నోటీసులు ఇచ్చింది. నెలలోగా సదరు సంస్థలు విదేశాల నుంచి తీసుకున్న నిధుల మొత్తం, ఏ అవసరం మేరకు తీసుకున్నారో, వాటిని వేటికి ఉపయోగించారో సవివరంగా తెలపాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఇంతవరకు సదరు స్వచ్ఛంద సంస్ధలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఎఫ్ సీఆర్ఏ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి లైసెన్సులను రద్దు చేసినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.