: మరింత భారం కానున్న ఆర్టీసీ బస్సు ప్రయాణం!
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపునకు రంగం సిద్ధం అవుతోంది. ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్సీ ఇవ్వాలంటే చార్జీలను పెంచక తప్పదని ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగానే ఉందని సమాచారం. ఏపీ ప్రభుత్వం మాత్రం మరికొంత కాలం వేచిచూద్దామన్న ఆలోచనలో ఉంది. పల్లె వెలుగు, పట్టణ సర్వీసులను మినహాయించి మిగతా అన్ని సర్వీసులపైనా 15 శాతం వరకూ చార్జీలను పెంచాలని నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ను ప్రకటించిన నేపథ్యంలో, ఇదే విధానాన్ని తమకూ వర్తింపజేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేతనాలు పెంచితే, ఆర్టీసీపై సంవత్సరానికి రూ.1800 కోట్ల అదనపు భారం పడుతుందని, చార్జీలు పెంచకుండా ఈ భారాన్ని భరించే శక్తి లేదని ఆర్టీసీ యాజమాన్యం వాపోతోంది. కాగా, వచ్చే నెల రెండో వారంలో చార్జీల పెంపు ప్రకటన ఉండవచ్చని అధికార వర్గాల సమాచారం.