: చావు ముఖం చూసి వచ్చాను... ఉద్యమం నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న కేసీఆర్!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘నేనున్నా... లేకున్నా’’ అంటూ వ్యాఖ్యానించి ఇప్పటికే పలుమార్లు టీఆర్ఎస్ కార్యకర్తలను కలవరానికి గురిచేసిన ఆయన నిన్నటి పార్టీ బహిరంగ సభలో ఉద్యమం నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని కార్యకర్తల్లో కాస్తంత ఉత్సాహం నింపారు. ‘‘చావు ముఖం చూసి వచ్చాను’’ అంటూ మొదలుపెట్టిన ఆయన 2009లో నాటి సీఎం రోశయ్య నిర్ణయాలను ఎండగట్టారు. తెలంగాణ వాసులకు అటెండర్ పోస్టు కూడా దక్కకుండా 14ఎఫ్ ను సవరించిన రోశయ్య నిర్ణయానికి నిరసనగా తాను ఆమరణ దీక్ష చేపట్టాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో శ్రీకాంతాచారి బలిదానం తనను కంటతడి పెట్టించిందని కేసీఆర్ గద్గద స్వరంతో చెప్పారు. ‘‘శ్రీకాంతాచారి బాటలోనే నేను కూడా చావు అంచు వరకూ వెళ్లి, మృత్యువును ముద్దాడుతున్న క్షణంలో కేంద్రం దిగివచ్చి తెలంగాణను ప్రకటించింది. అయితే కొన్ని గుంట నక్కలు సెన్సెక్స్ మార్కెట్ లో ఫిగర్లు చూపించినట్లు, ఎమ్మెల్యేల రాజీనామాలపై కల్పితాలు సృష్టించి ఢిల్లీ ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేశాయి. ఆ తర్వాత సకల జనుల సమ్మెతో తెలంగాణ సమాజం మొత్తం గిరిగీసి ఒకవైపు నిలుచుంది. భారత ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని నిలదీసి పోరాడితే తెలంగాణ సాకారమైంది’’ అని ఆయన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.