: వారితో రాజీనామా చేయించు... ఎవరి బలమెంతో తెలుస్తుంది: కేసీఆర్ కు చంద్రబాబు సవాల్
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మధ్య మాటల యుద్ధం నడిచింది. 'హైదరాబాదు నుంచి వెళ్లమన్నా, వెళ్లడట' అంటూ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్, చంద్రబాబుపై పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. దీనికి చంద్రబాబు తన పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వస్తే, ఎవరి బలమెంతో తెలుస్తుందని చంద్రబాబు, కేసీఆర్ కు సవాల్ విసిరారు. అయినా తనవద్ద పని చేసి, తనకిక్కడ ఏం పని అంటూ వ్యాఖ్యానిస్తారా? అని కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అదే బలమని భ్రమపడుతున్నారు. చేతనైతే... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా! ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది. మేం సిద్ధంగానే ఉన్నాం. మీరు సిద్ధమో, కాదో తేల్చుకోండి. ఇదే ఎన్టీఆర్ భవన్లో కూర్చుని కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ పాఠాలు చెప్పిన కొంతమంది వ్యక్తులు... ఇప్పుడు బయటికి వెళ్లి తిట్ల పురాణం విప్పుతున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు. నా దగ్గర పనిచేసి, ట్రస్ట్ భవన్లో పాఠాలు చెప్పిన వ్యక్తి 'ఇప్పుడు నీకిక్కడే పని?' అంటున్నారు. వారి మాటలు మనసుకు బాధ కలిగిస్తున్నాయి. ప్రజలు, కార్యకర్తలతో ఉన్న సంబంధాన్ని ఎవరూ విడదీయలేరు’’ అని చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడారు.