: ఏడుస్తుంటే జగదీశ్వర్ రెడ్డి ఓదార్చారు: కేసీఆర్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న టీఆర్ఎస్ మహాసభలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడారు. 14 ఏళ్ల క్రితం పిడికెడు మందితో ఉద్యమం ప్రారంభమైందన్నారు. జలదృశ్యంలో ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నామన్నారు. ఆర్నెల్ల తర్వాత అడ్రస్ ఉండరని కూడా ఎద్దేవా చేశారని తెలిపారు. ఇంటికి ఒక యువకుడిని చొప్పున తనతో పంపితే ఫలితం చూపిస్తానని అప్పుడు చెప్పానని వివరించారు. లక్ష్యం నుంచి వైదొలిగితే రాళ్లతో కొట్టండని చెప్పానని గుర్తు చేసుకున్నారు. తాను చావు అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చానని, అనంతరం విద్యార్థులు సింహాలై గర్జించారని, తద్వారా కేంద్రం దిగొచ్చిందని పేర్కొన్నారు. ఇక, సకల జనుల సమ్మె కోసం తెలంగాణ మొత్తం కదిలి వచ్చిందన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ఆత్మాహుతికి పాల్పడడం కలచివేసిందన్నారు. ఆ సమయంలో తాను ఏడుస్తుంటే జగదీశ్వర్ రెడ్డి ఓదార్చారని చెప్పారు. శ్రీకాంతాచారి ఆత్మ త్యాగాన్ని మరువలేనని చెప్పారు.