: వీధి కుక్కను కాపాడేందుకు రూ.3 కోట్ల విలువైన కారును చెట్టుకు ఢీకొట్టాడు!
ఢిల్లీలో ఆదివారం సాయంత్రం ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆశిష్ సబర్వాల్ అనే వ్యక్తి తన ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కారులో ప్రయాణిస్తున్నాడు. చాణక్యపురి సమీపంలోని ఇటలీ దౌత్య కార్యాలయం వద్దకు వచ్చేటప్పటికి ఓ వీధి కుక్క రోడ్డుపైకి వచ్చింది. కారు వేగంగా వెళుతుండడంతో బ్రేకులు వేస్తే మరింత ప్రమాదమని, అలా కాకుండా ముందుకెళితే కుక్క ప్రాణాలు కోల్పోతుందని అర్థం చేసుకున్న సబర్వాల్ వెంటనే కారును రోడ్డు పక్కకి మరల్చి చెట్టును ఢీకొట్టాడు. తన కారు విలువ రూ.3 కోట్లు కాగా, చెట్టును ఢీకొంటే దెబ్బతింటుందని తెలిసినా అతడు కుక్క ప్రాణాలకు విలువనివ్వడం విశేషం. దీంతో, కుక్క క్షేమంగా రోడ్డు దాటింది. ఇక, కారు బానెట్, ఫ్రంట్ గ్రిల్ బాగా దెబ్బతిన్నాయి. ఇంజిన్ కూడా దెబ్బతిన్నది. చాణక్యపురి దిశగా వెళుతుండగా, కుక్క అడ్డం వచ్చిందని, దాన్ని కాపాడే క్రమంలో కారు ఫుట్ పాత్ పైకి ఎక్కి, పక్కనే ఉన్న చెట్టును ఢీకొందని వివరించాడు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో పాటు, పబ్లిక్ ప్రాపర్టీకి పెద్దగా నష్టం వాటిల్లకపోవడంతో పోలీసులు మామూలు ఘటనగానే పరిగణించి వదిలేశారు. 4,735 సీసీ ఇంజిన్ తో కూడిన ఈ కారు అత్యధికంగా 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కారును నిపుణులైన డ్రైవర్ మాత్రమే నడపగలడని ఆటోమొబైల్ వర్గాలంటున్నాయి.