: కేరళ సీఎంకు 'బేవాచ్' బ్యూటీ లేఖ
దేశంలో కేబుల్ టీవీ ప్రసారాలు మొదలైన తొలినాళ్లలో వచ్చిన బేవాచ్ కార్యక్రమం విపరీతమైన ప్రజాదరణ సొంతం చేసుకుంది. బీచ్ లో సేద దీరడానికి వచ్చే ప్రజలు ఏదైనా ప్రమాదానికి గురైతే వారిని కాపాడేందుకు ఓ బృందం అక్కడ సిద్ధంగా ఉంటుంది. ఆ బృందంలోని సభ్యుల నడుమ చోటుచేసుకున్న డ్రామాతో బేవాచ్ సిరీస్ ను బుల్లితెరకెక్కించారు. ఆ కార్యక్రమంతో బాగా పాప్యులరైన తార పమేలా ఆండర్సన్. ఎరుపు రంగు స్విమ్ సూట్లో పరువాలను ఆరబోసిన ఆ అమ్మడు ఇప్పుడు 'పెటా' ఉద్యమకారిణి. తాజాగా కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఓ లేఖ రాసింది. కేరళలో ప్రముఖ ఉత్సవంగా పేరుగాంచిన 'త్రిసూర్ పూరమ్' వేడుకల్లో ఏనుగులను ఉపయోగించరాదంటూ ఈ-మెయిల్ ద్వారా పంపిన తన లేఖలో కోరింది. త్రిసూర్ లోని వడక్కునాథన్ దేవాలయంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. అటు, ఉత్సవంలో ప్రదర్శన కోసం సిద్ధం చేసిన ఏనుగులను రిజిస్టర్ చేయించలేదని యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) పేర్కొంది. వాటిని వేడుకలకు దూరంగా ఉంచాలని కేరళ అధికారులకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, పమేలా లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏనుగుల స్థానంలో, వెదురు, కాగితపు గుజ్జుతో తయారుచేసిన 30 భారీ బొమ్మ ఏనుగుల తయారీలో సాయపడతామని ఈ బేవాచ్ సుందరి తెలిపింది. ఏనుగుల నిర్బంధాన్ని భారత్ లోనూ, అంతర్జాతీయంగానూ గట్టిగా వ్యతిరేకిస్తున్న విషయం మీకు తెలుసని భావిస్తున్నానని కేరళ సీఎంను ఉద్దేశించి అమ్మడు తన లేఖలో పేర్కొంది.