: క్రికెట్ బెట్టింగులో వేలు పెట్టిన రైతు... కిడ్నీలు అమ్ముకోమన్న బుకీలు
క్రికెట్ ద్వారా కోట్లు కొల్లగొట్టాలని ఆశించి మోసపోయాడో రైతు. నెల్లూరు జిల్లాలో జరిగిందీ ఉదంతం. అల్లూరుకు చెందిన మల్లికార్జున్ అనే రైతు బుకీల దెబ్బకు బాధితుడయ్యాడు. వాటా ఇస్తామంటూ క్రికెట్ బుకీలు సదరు రైతుకు వల విసిరారు. దీంతో, పెద్ద ఎత్తున నగదు వచ్చిపడుతుందని భావించిన ఆ వ్యక్తి మరేమీ ఆలోచించకుండా పొలం అమ్మేశాడు. మొత్తం రూ.2.5 కోట్లను బుకీలకు అప్పనంగా అందించాడు. అక్కడి నుంచి కథ మలుపు తిరిగింది. డబ్బులు అడిగితే, విచిత్రమైన సలహా ఇచ్చారా బుకీలు. కిడ్నీలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయని మల్లికార్జున్ కు సూచించారు. దీంతో, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. తన డబ్బులు తనకు ఇప్పించాలని, పొలం అమ్మి ఆ డబ్బు వారి చేతుల్లో పెట్టానని ఎస్పీకి మొరపెట్టుకున్నాడు. మరి, దీనిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి.