: పారితోషికం కోసం మొత్తుకుంటున్న గవాస్కర్
బీసీసీఐ నుంచి తనకు రావాల్సిన పారితోషికం కోసం మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మొత్తుకుంటున్నారు. గతేడాది సుప్రీం ఆదేశాల మేరకు గవాస్కర్ ఐపీఎల్ నిర్వహణ బాధ్యతలు తలకెత్తుకున్నారు. అయితే, ఆ సమయంలో క్రికెట్ కామెంటరీ, పలు వాణిజ్య ఒప్పందాలను ఆయన నిలుపుదల చేసుకున్నారు. ఈ క్రమంలో తనకు రూ.1.90 కోట్లను పారితోషికంగా చెల్లించాలని గవాస్కర్ బీసీసీఐని కోరారు. దీనిపై సుప్రీం కూడా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా, ఈ ముంబైవాలా బీసీసీఐకి లేఖ రాసినట్టు తెలిసింది. దీనిపై బోర్డు వర్కింగ్ కమిటీ వర్గాలు సానుకూలంగానే ఉన్నాయట. గవాస్కర్ కు చెల్లించాల్సిన పారితోషికంపై ఇప్పటికైతే ఆమోదం తెలపలేదని, అయితే, సుప్రీం కోర్టు ఆదేశాలున్నందున తప్పక చెల్లిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. గవాస్కర్ రాసిన లేఖను బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ ముందు ఉంచుతామని చెప్పారు.