: 2024 ఒలింపిక్స్ కు భారత్ బిడ్!... మోదీతో సమావేశం కానున్న ఐఓసీ చీఫ్
విశ్వ క్రీడా సంబరం, ఒలింపిక్స్ పోటీలను ఇండియాలో నిర్వహించాలన్న కలను సాకారం చేసుకునే దిశగా నేటి సాయంత్రం కీలక అడుగు పడనుంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బక్ నేడు ప్రధాని మోదీని కలిసి, ఈ విషయమై ప్రత్యేకంగా చర్చించనున్నారు. మరో 9 సంవత్సరాల తరువాత, 2024లో జరిగే ఒలింపిక్ పోటీలకు ఆతిథ్యమివ్వాలన్న భారతీయుల ఆకాంక్షను నెరవేర్చే దిశగా తనవంతు ప్రయత్నం చేస్తానని ఇప్పటికే మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. 2013లో ఐఓసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత బక్ నేడు తొలిసారిగా భారత్ లో పర్యటిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు బక్, మోదీల మధ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి భారత ఒలింపిక్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ సమావేశమై ఇండియాలో పోటీల నిర్వహణపై చర్చించింది. బిడ్డింగ్ వేసే విషయంలో తీసుకున్న నిర్ణయాలపై మాత్రం అధికారులెవరూ నోరు మెదపలేదు. కాగా, ప్రధానితో తన చర్చలు ఏ అంశంపై జరిగినా, సత్ఫలితాలు ఇస్తాయని భావిస్తున్నట్టు బక్ వ్యాఖ్యానించారు.