: ఠాకూర్ కు బుకీలతో సంబంధాలున్నాయనడానికి ఆధారాల్లేవు: ఐపీఎల్ చైర్మన్
బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కు బుకీలతో సంబంధాలున్నయనడానికి ఆధారాల్లేవని ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ రాజీవ్ శుక్లా అంటున్నారు. ఠాకూర్ ఓ బుకీతో కలిసి పార్టీలో కనిపించాడంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. అయితే, ఆధారాలేవైనా దొరికిన తర్వాతే దీనిపై వ్యాఖ్యానిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంపై విచారణకు డిమాండ్ చేస్తారా? అన్న ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు. అటు, బీజేపీ నేత, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, బుకీలతో ఠాకూర్ కు లింకులున్నట్టు వినడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అతడికి అలాంటి వ్యక్తులతో సంబంధాలున్నాయంటే తాను నమ్మబోనని తెలిపారు. ఠాకూర్ కు బుకీలతో సంబంధాలపై ఐసీసీ ఇప్పటికే బీసీసీఐకి లేఖ రాసినట్టు సమాచారం.