: రూ. 25 వేల కోట్లతో ఐగేట్ ను కొనుగోలు చేయనున్న క్యాప్ జెమిని
ఫ్రాన్స్ కేంద్రంగా ఐటీ సేవలందిస్తున్న క్యాప్ జెమిని, 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 వేల కోట్లు) చెల్లించి ఐగేట్ కార్పొరేషన్ ను కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని క్యాప్ జెమినీ ఈ ఉదయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఐగేట్ తమ సంస్థలో విలీనం అయితే, ఉత్తర అమెరికా తమకు అతిపెద్ద మార్కెట్ గా అవతరిస్తుందని తెలిపింది. కాగా, న్యూజర్సీ కేంద్రంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్న ఐగేట్ 2014లో 1.3 బి. డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఒక్కో ఈక్విటీ వాటాకు 48 డాలర్ల చొప్పున చెల్లించేందుకు నిర్ణయించినట్టు క్యాప్ జెమినీ ప్రకటించింది. ఈ డీల్ కోసం సొంత నిధులతో పాటు 6 శాతానికి మించకుండా షేర్ కాపిటల్ ను వినియోగిస్తున్నట్టు కూడా సంస్థ తెలియజేసింది. ఈ డీల్ కు తమ వాటాదారులు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలిపింది.