: జయలలిత కేసులో తీర్పుకు సుప్రీం అనుమతి
ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు వెలువరించేందుకు కర్ణాటక హైకోర్టుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ప్రాసిక్యూటర్ నియామకంతో సంబంధం లేకుండా తీర్పు ఇవ్వాలని ముగ్గురు జడ్జిల నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పుపై విధించిన స్టేను సుప్రీం ఎత్తివేసింది. కేసులో ఇంతవరకు జరిగిన వాదనలు చాలని, కొత్తగా వాదనలు వినాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ వాదనలతోనే తీర్పు వెల్లడించవచ్చని ఆదేశించింది. కాగా కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాల్సిన అవసరం తమిళనాడు ప్రభుత్వానికి లేదని చెప్పింది. అంతేగాక ఆయన ద్వారా కర్ణాటక హైకోర్టులో జయ కేసుపై తాజా వాదనలు వినాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రాసిక్యూటర్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత అన్బగన్ వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం తుది నిర్ణయాన్ని వెల్లడించింది.