: హరీశ్ కు ప్రాధాన్యం తగ్గుతోందా?...టీఆర్ఎస్ ప్లీనరీలో బ్యాక్ బెంచీలో కేసీఆర్ మేనల్లుడు


తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో పార్టీ అధినేత కేసీఆర్ తర్వాతి స్థానం హరీశ్ రావుదే. అటు పార్టీలోనే కాక తెలంగాణ ప్రభుత్వంలోనూ ఆయనదే కీలక భూమిక. అయితే మొన్నటి టీఆర్ఎస్ ప్లీనరీలో హరీశ్ రావు బ్యాక్ బెంచీకే పరిమితమయ్యారు. అంతేకాక ప్లీనరీతో పాటు నేటి పార్టీ బహిరంగ సభ కోసం ఏర్పాటైన పార్టీ కమిటీల్లో హరీశ్ కు చోటు దక్కలేదు. మొన్నటి ప్లీనరీలో కేసీఆర్ కొడుకు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చక్రం తిప్పితే, తాజాగా నేటి పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావులు అన్నీ తామై తిరుగుతున్నారు. అంటే, పార్టీలో హరీశ్ కు ప్రాధాన్యం క్రమంగా తగ్గుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలో ఉండగా, కేసీఆర్ ప్రాతినిథ్యం వహించిన సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆ తర్వాత హరీశ్ దక్కించుకున్నారు. అక్కడ ఎప్పుడు పోటీ జరిగినా, వరుసగా హరీశ్ దే గెలుపు. అంతేనా, కేసీఆర్ కే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి పులివెందుల అసెంబ్లీలో వచ్చిన మెజారిటీని హరీశ్ రావు ఎప్పుడో బద్దలు కొట్టేశారు. అంతేకాక తెలంగాణలో సాధారణ ఎన్నికలైనా, ఉపఎన్నికలైనా... సొంత జిల్లా అయినా, ఇతర జిల్లా అయినా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో హరీశ్ రావు ప్రణాళికలు చక్కగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావుకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతున్న విషయాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్లీనరీలో వెనుకబెంచీలో హరీశ్ ను చూసి తెగ ఇబ్బందిపడ్డ కార్యకర్తలు ఆయన మాట్లాడటానికి వచ్చేసరికి ఎల్బీ స్టేడియం అదిరిపోయేలా మద్దతు పలికారు.

  • Loading...

More Telugu News