: మైక్రోమ్యాక్స్ లో చైనా 'అలీ బాబా' భారీ పెట్టుబడి!
ఇండియా కేంద్రంగా పనిచేస్తూ, మొబైల్ వ్యాపారంలో సేవలందిస్తున్న రెండో అతిపెద్ద సంస్థగా గుర్తింపున్న మైక్రోమ్యాక్స్ లో చైనాలోని ప్రముఖ ఆన్ లైన్ ఫైనాన్స్ సేవల సంస్థ ఏఎఫ్ఎస్ జీ (యాంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ - అలీ బాబా గ్రూప్) అనుబంధ సంస్థ 'అలీపే' భారీగా పెట్టుబడులు పెట్టనుంది. సుమారు రూ. 24 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్ల రూపాయల వరకూ విలువ ఉంటుందని అంచనా వేస్తున్న మైక్రోమ్యాక్స్ లో 25 శాతం వాటాలను కొనుగోలు చేయాలని అలీపే ప్రాథమిక ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు ముగ్గురు భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నట్టు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం మైక్రోమ్యాక్స్ లో నలుగురు వ్యవస్థాపకులు రాహుల్ శర్మ, రాజేష్ అగర్వాల్, సుమీత్ కుమార్, వికాస్ జైన్ లకు 80 శాతానికి కాస్తంత తక్కువ వాటాలు ఉన్నాయి. సంస్థ విలువ రూ. 1500 కోట్లుగా లెక్కించిన సమయంలో 15 శాతం వాటాను రూ. 225 కోట్లు చెల్లించి టీఏ అసోసియేట్స్ కొనుగోలు చేసింది. ఇప్పుడు 25 శాతం వాటా కోసం అలీపే రూ.6 వేల కోట్ల నుంచి రూ.7.5 వేల కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సి రావచ్చని అంచనా. మైక్రోమ్యాక్స్ వ్యాపారంలో 70 శాతం వరకూ రిటైల్ స్టోర్లలో జరిగే మొబైల్ ఫోన్ల అమ్మకాల నుంచి వస్తుండగా, మిగతాది ఆన్ లైన్ మాధ్యమంగా జరిగే కొనుగోళ్ల రూపంలో లభిస్తోంది.