: నేటితో టీఆర్ఎస్ కు 14 ఏళ్లు... పరేడ్ గ్రౌండ్స్ సభకు పోటెత్తనున్న అభిమానం!


తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఆవిష్కరించడమే లక్ష్యంగా పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి నేటితో 14 ఏళ్లు నిండాయి. నాడు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పాలనలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్), మంత్రి పదవి దక్కలేదన్న కారణంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, టీఆర్ఎస్ పేరిట వేరు కుంపటి పెట్టుకున్నారు. అనతి కాలంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా ఆ పార్టీ సాగించిన ఉద్యమ తీరు తెలంగాణవాదులను ఒక్కతాటిపైకి చేర్చింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ ప్లీనరీలో కేసీఆర్ మరోమారు పార్టీ అధ్యక్షుడి బాధ్యతలను చేపట్టారు. తాజాగా నేడు ఆ పార్టీ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ నిర్వహిస్తోంది. ఈ సభకు తెలంగాణలోని పది జిల్లాల నుంచి 10 లక్షల మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బహిరంగ సభ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాదు గులాబీమయమైపోయింది. పార్టీ బేనర్లు, జెండాలతో హైదరాబాదు ప్రధాన రహదారులు నిండిపోయాయి.

  • Loading...

More Telugu News