: ఇక చినబాబు వంతు... ఏపీకి పెట్టుబడుల కోసం అమెరికాకు నారా లోకేశ్!


రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో కొత్త రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టేందుకు సీఎం హోదాలో నారా చంద్రబాబునాయుడు కాళ్లకు చక్రాలు కట్టుకున్న చందంగా తీరిక లేకుండా విదేశీ పర్యటనలు సాగిస్తున్నారు. అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలనే ఆయన సాధించారు. తాజాగా ఆయన తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన వచ్చే నెల 3 న అమెరికా వెళుతున్నారు. ఏకంగా పది రోజుల పాటు అక్కడే ఉండే ఆయన అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తారట. ఆయా రాష్ట్రాల గవర్నర్లు, పారిశ్రామికవేత్తలతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోనూ భేటీ అయ్యేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో అమెరికాలో విద్యాభ్యాసం, కొంతకాలం పాటు అక్కడే ఉద్యోగం చేసిన అనుభవం నేపథ్యంలో అక్కడ ఆయనకు పెద్ద సర్కిలే ఉంది. తాజాగా తానా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సతీశ్ వేమనతోనూ లోకేశ్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో లోకేశ్, మంచి ఫలితాలను రాబట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News