: టీమిండియా కోచ్ ఎంపిక బాధ్యత ‘ఆ ముగ్గురి’దేనట!
టీమిండియా కోచ్ డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం వన్డే వరల్డ్ కప్ తోనే ముగిసింది. అయితే కొత్త కోచ్ ఎవరన్న విషయంపై బీసీసీఐ కసరత్తే ఇంకా ప్రారంభం కాలేదు. మరి డంకన్ ఫ్లెచర్ పదవీ కాలాన్ని మరోసారి పొడిగిస్తారా? అంటే, అది కూడా లేదట. కొత్త కోచ్ త్వరలో వస్తారంటూ బీసీసీఐ చెబుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారధి సౌరవ్ గంగూలీ కోచ్ అవతారం ఎత్తనున్నారని ఇటీవల వార్తలు వెల్లువెత్తాయి. అయితే గంగూలీ కోచ్ గా రాడని బీసీసీఐ తేల్చిచెప్పింది. అయితే కోచ్ ఎవరన్న దానిపై నిర్ణయం మాత్రం అతడిదేనట. మైదానంలో నాడు అతడితో కలిసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించిన మాజీ క్రికెటర్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లతో కలిసి టీమిండియా కోచ్ ను అతడు నిర్ణయిస్తాడట. ఈ మేరకు నిన్న జరిగిన బీసీసీఐ సమావేశం తీర్మానించింది. కోచ్ ఎంపిక కమిటీలో ఈ ముగ్గురికి చోటు కల్పించింది. ఇదిలా ఉంటే, ఈ ముగ్గురి సేవలను మరింత మేర వినియోగించుకునేందుకు తీర్మానించిన బీసీసీఐ, వారిని బోర్డు సలహాదారులుగా నియమించాలని భావిస్తోంది.