: ఎర్రచందనం స్మగ్లింగ్ లో పెద్దమనుషులు చాలా మంది ఉన్నారు: కర్నూలు జిల్లా ఎస్పీ
ఎర్రచందనం స్మగ్లింగ్ లో చాలా మంది పెద్దమనుషులున్నారని కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ అన్నారు. టాలీవుడ్ హీరోయిన్, ‘ఎర్ర’ స్మగ్లర్ మస్తాన్ వలీ భార్య నీతూ అగర్వాల్ ను అరెస్ట్ చేసిన సందర్భంగా రవికృష్ణ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. 'ప్రేమ ప్రయాణం' చిత్రంలో నటించిన నీతూ, ఆ చిత్ర నిర్మాత మస్తాన్ వలీతో సన్నిహితంగా మెలిగిందని చెప్పారు. ఈ క్రమంలో స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సొమ్మును మస్తాన్, నీతూ అకౌంట్ కు బదిలీ చేసి, ఆ ఖాతా నుంచి తన సహచరులకు డబ్బు పంపాడు. ఈ విషయాలన్నింటినీ నిర్ధారించుకున్న తర్వాతే నీతూను అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. ఇక ఈ అక్రమ దందాలో గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకూ స్మగ్లర్లు వివిధ హోదాల్లో ఉన్నారన్నారు. వీరిలో పెద్దమనుషులు చాలా మందే ఉన్నారని చెప్పిన ఆయన, పూర్తి ఆధారాలు లభ్యమైన తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ వ్యవహారంలో పెద్దమనుషుల పాత్ర కచ్చితంగా ఉందని మాత్రం చెప్పగలనని ఆయన పేర్కొన్నారు.