: తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన మెడికో... ఫోన్ చేసి చెప్పి మరీ ఆత్మహత్య!
నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలోని కామినేని వైద్య కళాశాలలో పీజీ వైద్యవిద్యనభ్యసిస్తున్న రఘురాం అనే మెడికో నేటి తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చదువుతున్న కళాశాలలోని ఓ విద్యార్థినితో ప్రేమలో పడ్డ అతడు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం. సాధారణంగా ఆత్మహత్య చేసుకునే వారు గుట్టుచప్పుడు కాకుండా, ఎవరూ లేని ప్రదేశం చూసి సూసైడ్ చేసుకుంటారు. కాని రఘురాం, తాను ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి, వారికి తీరని కడుపుకోతను మిగిల్చాడు. నేటి తెల్లవారుజామునే హైదరాబాదులోని వనస్థలిపురంలో ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్ చేసిన రఘురాం, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో కంగారుపడ్డ అతడి తల్లిదండ్రులు వెనువెంటనే నార్కట్ పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా వేగంగానే స్పందించారు. అతడు ఉంటున్న అద్దె గదికి పోలీసులు చేరుకునేలోగానే రఘురాం విగత జీవిగా పడి ఉన్నాడు.