: చెపాక్ లో మెకల్లమ్, ధోనీ మెరుపులు... సూపర్ కింగ్స్ భారీ స్కోరు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ సత్తాను దృష్టిలో పెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ తనదైన శైలిలో విధ్వంసం సృష్టించాడు. ఈ కివీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 66 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ డ్వేన్ స్మిత్ 13 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. ఇక, ధోనీ 41 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. 27 బంతులెదుర్కొన్న ధోనీ 2 సిక్సులు, 2 ఫోర్లతో అలరించాడు. సురేశ్ రైనా 29 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో అనురీత్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. చెపాక్ పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తుండడంతో, పంజాబ్ ఇన్నింగ్స్ లోనూ పరుగుల వెల్లువ ఖాయమని భావిస్తున్నారు. ఆ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, మ్యాక్స్ వెల్, మిల్లర్, మార్ష్, బెయిలీ, విజయ్ వంటి ఉద్దండులున్నారు. భారీ భాగస్వామ్యాలు నమోదైతే విజయం కష్టంకాబోదని పంజాబ్ సారథి బెయిలీ విశ్వసిస్తున్నాడు. లోయరార్డర్ లో మిచెల్ జాన్సన్, అక్షర్ పటేల్ కూడా బ్యాట్ ఝుళింపిచే సత్తా ఉన్నవారే కావడంతో మ్యాచ్ ఫలితంపై ఆసక్తి నెలకొంది.