: నాది జల దీక్ష... అయ్యప్ప దీక్ష వంటిదే: చంద్రబాబు
ప్రకాశం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. మునగనూరు మండలం పోలవరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తాను అయ్యప్ప దీక్ష తరహాలోనే జల దీక్ష తీసుకున్నానని తన సంకల్పాన్ని చాటారు. రాష్ట్రంలో అందరికీ సాగు, తాగు నీరు అందించడమే తన లక్ష్యమని, అప్పటిదాకా దీక్షగా పనిచేస్తానని స్పష్టం చేశారు. కాగా, ఆయన గుండ్లకమ్మ ప్రాజెక్టును కూడా సందర్శించారు. ప్రకాశం జిల్లాలో పర్యటన ముగిసిన వెంటనే ఆయన హెలికాప్టర్లో నెల్లూరు బయల్దేరి వెళ్లారు. జిల్లాలోని తూపిటిపాలెంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ)కి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి కూడా పాల్గొంటారు.